ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నెలల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమనంలోకి పయనిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. డిసెంబరు నెలాఖరుకు లక్షా 72 వేల కోట్ల రెవెన్యూ వసూళ్ల సాధన లక్ష్యం కాగా, వసూలైంది రూ.72 వేల కోట్లు మాత్రమే. రాష్ర్ట ఆర్థిక పరిస్థితికి ఈ అంకెలే ఉదాహరణ.  జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కున్న పేరు, పరపతులు దెబ్బతింటున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోగా, వున్న పరిశ్రమలు తరలిపోతాయనే ప్రచారం భయాందోళనలకు గురిచేస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల కోసం రాష్ట్రాలు, దేశాలు పోటీపడుతున్న వాతావరణం వుంది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వారికి రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. కానీ ఎపిలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. పరిశ్రమల స్థాపన వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు.

అధికారంలోకి వచ్చింది మొదలు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. తిరుపతిలో 15 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ పార్క్ పెట్టడానికి ముందుకొచ్చిన రిలయన్స్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. వైజాగ్ లో అదానీ డేటా సెంటర్ వెనక్కి పోయింది. అదే సమయంలో హైదరాబాద్ లో అమెజాన్ పదివేల కోట్లతో డేటా సెంటర్ పెట్టబోతోంది. ఈ ప్రభుత్వపు తుగ్లక్ చర్యల మూలంగా ఎపి నష్టపోతుంటే, పక్క రాష్ట్రాలు బాగుపడుతున్నాయి. అమరావతి నుంచి రాజధాని మార్చే ప్రతిపాదనల వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ అయింది.

ప్రతిపక్షంలో వుండగా పెన్షన్లు పెంచుతామని, కరెంటు చార్జీలు తగ్గిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా పోతున్నారు. కరెంటు చార్జీలు పెంచారు. బస్ చార్జీలు పెంచారు. ఫైబర్ గ్రిడ్ కేబుల్ బిల్లులు పెంచారు. పెట్రోల, డీజిల్ పై ట్యాక్స్ పెంచారు. పెన్షన్లు, రేషన్ కార్డులకు కోతపెట్టారు. సంప్రదాయేతర విద్యుత్ రూ.4.50 పైసలు చెల్లించడం చాలా ఎక్కువ అని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసిన ఈ ప్రభుత్వం థర్మల్ పవర్ ను అంతకంటే ఎక్కువ రేటుకు కొంటుంన్నారు.  పోలవరం పనులు ఆగిపోయాయి. పోలవరం ఖర్చు కింద కేంద్రం ఇచ్చిన 1850 కోట్ల రూపాయలు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఇసుక దొరకడం గగనమైపోయింది. రాజధాని తరలింపుపై ఏకపక్ష పోకడలు పోతున్నారు. తరలింపు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినందుకు మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

నచ్చని అధికారులపై వేధింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు తరహా పరిపాలన సాగుతోంది. జగన్ ది తుగ్లక్ పాలన అని పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం ఇవేమీ పట్టకుండా నియంతృత్వ పోకడలు పోతోంది. ప్రజలు తిరగబడితే పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయిన సంఘటనలు ప్రపంచంలో కోకొల్లలు. కాబట్టి ప్రజాగ్రహం దహించక ముందే తన చర్యలను సరిదిద్దుకోవాలని జగన్మోహనరెడ్డిగారిని కోరుతున్నాను.

Categories: బ్లాగు
teTelugu