కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ, కొన్ని మీడియా సంస్థలు, కొందరు వామపక్ష భావజాల మేధావులు చేస్తున్న దుష్ప్రచారం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అలజడి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా దేశ సమగ్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే మైనారిటీల్లో అభద్రత సృష్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. యూనివర్శిటీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు.

 అసలు పౌరసత్వ సవరణ  బిల్లు వల్ల భారత పౌరులెవ్వరికీ ఎలాంటి హానీ జరగదు. భారతీయుల పౌరసత్వాన్ని ఎవరూ కూడా రద్దు చేయలేరు. దేశంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మతాల వారందరికీ రాజ్యాంగపరమైన హక్కులు, రక్షణలుంటాయి. భారతదేశం లౌకిక రాజ్యంగానే వుంటుంది.

పొరుగు దేశాల్లో అణచివేతకు, దాడులకు గురయ్యే మైనారిటీ ప్రజలు శరణార్ధులుగా భారతదేశానికి వస్తే, వారికి పౌరసత్వం ఇవ్వడం వల్ల ఇక్కడున్న మైనారిటీలకెలాంటి నష్టం వాటిల్లదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతంలో శరణార్ధులకు భారతీయ పౌరసత్వం ఇస్తే తమ సంస్కృతి, భాష కనుమరుగవుతాయని ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. అయితే వీరికెలాంటి నష్టం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మెజారిటీ రాష్ట్రాల్లో ఆరో షెడ్యూల్ అమలవుతోంది. అక్కడ బయటదేశాల వారే కాదు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా నివసించడానికి వీలు లేదు. మరికొన్ని రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్ వుంది. ఈ ఐఎల్పీ వున్న ప్రాంతాల్లో వేరే వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోలేరు.

కాబట్టి ఈ బిల్లు వల్ల ఈశాన్యానికి కానీ, దక్షిణాదికి గానీ, ఉత్తరాదికి గానీ, ముస్లింలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ లో దాడులుకు, బాధలకు గురై భారతదేశానికి వచ్చిన వారు గౌరవప్రదంగా జీవించడానికి తగిన ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేస్తుంది. కావున ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని విపక్షాల చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.

Categories: బ్లాగు
teTelugu