మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతాపార్టీ చేపట్టిన గాంధీ సంకల్పయాత్రలో భాగంగా అక్టోబరు 15 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహించాను. కృష్ణా  జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, పెనమలూరు, గుడివాడ, పామర్రు నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గాల్లో పర్యటించాను.

జగ్గయ్యపేట, నెల్లూరు నియోజకవర్గాల్లో నాతో పాటు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, పెనమలూరు నియోజకవర్గంలో కేంద్రమంత్రి సదానందగౌడ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ గారు, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుగారు పాల్గొన్నారు. గుడివాడ, పామర్రు నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇన్ చార్జి సునీల్ దేవధర్ గారు, బిజెపి నేత విష్ణువర్దన్ రెడ్డిగారు, ఒంగోలులో బిజెవైఎం నేత రమేష్ నాయుడు గారు పాల్గొన్నారు. మొత్తం 152 కిలోమీటర్లు జరిపిన ఈ పాదయాత్రలో గాంధీ గారి ఆశయాలు, లక్ష్యాలు, వాటి సాధనకు మనం చేయవలసిన కృషి గురించి ప్రజలకు మా బృందం వివరించింది.

గాంధీ గారి  పేర్లు పెట్టుకున్న నకిలీ గాంధీలు ఈ దేశంలో గాంధేయవాదాన్ని ఆచరించడంలో విఫలమయ్యారని ప్రజలు కూడా గుర్తించారు. గాంధీ మార్గమంటే పేరు చివరన గాంధీ అని పెట్టుకుని, వీధులకు గాంధీగారి పేరు పెట్టడం కాదని ప్రజలకు తెలియజేశాము. గ్రామ స్వరాజ్యం రావాలంటే వ్యవసాయం బాగుండాలని, రైతు కొడుకు కూడా రైతు కావాలని కోరుకున్నప్పుడే దేశం బాగుంటుందని చెప్పాము. స్వచ్ఛ భారత్, అవినీతి రహిత భారత్  కోసం పనిచేయాలని పిలుపునిచ్చాము. పాదయాత్రల సందర్భంగా పార్టీలకతీతంగా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. పలు చోట్ల స్థానికంగా వున్న సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చాము. మొత్తంగా పాదయాత్ర వల్ల మారుమూల గ్రామల్లో పరిస్థితులు, అక్కడి ప్రజల సమస్యల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. పాదయాత్రలో పాల్గొని వాటి విజయవంతానికి కృషి చేసిన నేతలు, ముఖ్యనాయకులు, ప్రజలందరికీ నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

Categories: బ్లాగు
teTelugu